ఒత్తిడి, థైరాయిడ్.. ఇతర అనేక కారణాల వల్ల చాలా మందికి వెంట్రుకలు రాలిపోతుంటాయి. అయితే డైప్ 2 డయాబెటిస్ ఉన్నా.. చాలా మందికి జుట్టు రాలిపోతుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ఈ వ్యాధి కారణంగా ఏటా అనేక మంది చనిపోతున్నారు. ఎన్నో కోట్ల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడిన వారి జాబితాలో చేరుతున్నారు. డయాబెటిస్‌లో 2 రకాలు ఉంటాయి. మొదటి రకం డయాబెటిస్ వంశ పారంపర్య కారణాల వల్ల వస్తే.. రెండోది అస్తవ్యవస్తమైన జీవన విధానం వల్ల వస్తుంది. మొదటి రకంలో శరీరంలో ఇన్సులిన్ తయారు కాకపోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక రెండో రకంలో ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ కేవలం మనం చేసే తప్పుల వల్ల వస్తుంది కనుక.. అది వచ్చే ముందు మన శరీరంలో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవేమిటంటే…
1. తీవ్రమైన అలసట
చిన్న పనికే బాగా అలసిపోతున్నా.. రోజంతా తీవ్రమైన అలసట, నీరసం ఉంటున్నా.. డయాబెటిస్ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే.. డయాబెటిస్ ఉన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. అది మన శరీర కణాలకు చేరదు. దీంతో ఆ కణాలు గ్లూకోజ్ అందక అలమటిస్తాయి. అలాంటప్పుడు మన శరీరానికి శక్తి సరిగ్గా అందదు. దీంతో మనం నీరసించిపోతాం. ఫలితంగా అలసట కూడా వస్తుంది. ఈ లక్షణం గనక మీకు ఉంటే వెంటనే షుగర్ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మందులు వాడితే మంచిది.
2. వెంట్రుకలు రాలిపోవడం
ఒత్తిడి, థైరాయిడ్.. ఇతర అనేక కారణాల వల్ల చాలా మందికి వెంట్రుకలు రాలిపోతుంటాయి. అయితే డైప్ 2 డయాబెటిస్ ఉన్నా.. చాలా మందికి జుట్టు రాలిపోతుంది. అందుకని ఈ సమస్య ఉన్నా వెంటనే స్పందించి డాక్టన్ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
3. చర్మంపై మచ్చలు
ఎరుపు, బ్రౌన్, ఎల్లో కలర్ ప్యాచ్‌లు లేదా మచ్చలు మన శరీరంపై కనిపిస్తుంటే.. అది టైప్ 2 డయాబెటిస్ ఉందని చెప్పడానికి సంకేతం కావచ్చు. అందువల్ల ఈ లక్షణం కనిపించినా డయాబెటిస్ గా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి.
4. అధికంగా నీటిని తాగడం
సాధారణంగా చాలా మంది నీటిని అధికంగా తాగుతుంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు కూడా తమకు తెలియకుండానే నీటిని బాగా తాగేస్తుంటారు. ఇలా గనక జరుగుతుంటే దాన్ని డయాబెటిస్‌గా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలవాలి.
5. మూత్ర విసర్జన
నీటిని బాగా తాగినప్పుడు లేదా బయటి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సహజంగానే ఎవరికైనా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. అయితే ఈ సమయాల్లో కాకుండా ఇతర ఏ సమయంలోనైనా సరే.. మూత్రానికి తరచూ వెళ్లాల్సి వస్తుంటే దాన్ని డయాబెటిస్‌గా అనుమానించాలి. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాలి.