ఇటీవల తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఎస్సై ప్రాథమిక పరీక్షలో దొర్లిన కొన్ని తప్పులు కొందరు అభ్యర్థులపాలిట వరంగా మారనున్నది. మొత్తం 200 మార్కులకు ఈ నెల 7 నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్‌ఎల్పీఆర్బీ శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీలో పేర్కొన్న ప్రకారం తప్పులు దొర్లిన మొత్తం 8 ప్రశ్నలను తొలగించినట్టు బోర్డు తెలిపింది. ఆ ఎనిమిది ప్రశ్నలకు 8 మార్కులను అభ్యర్థులకు కలపనున్నట్టు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 60 (30శాతం) వస్తే వారిని తర్వాతి దశకు అర్హులుగా నిర్ణయించారు.
మొత్తం 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నందున ప్రాథమిక పరీక్షలో 52 మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం తర్వాతి దశకు అర్హులుగా గుర్తించనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంటే 60 మార్కులకు బదులు, 52 మార్కులు సాధించిన వారు సైతం తర్వాతి దశకు అర్హత సాధించినట్టే. పరీక్ష నిర్వహణలో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో ప్రశ్నపత్రాలు రూపొందిస్తారని, ఒక భాష నుంచి ప్రశ్నలు మరో భాషలోకి తర్జుమా చేసేటప్పుడు, కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు రెండు, మూడు (ఏ,బీ,సీ,డీ ఆప్షన్లలో) సమాధాలు సరైనవిగా ఉండటం, కొన్నిసార్లు 4 ఆప్షన్లలో కూడా సమాధానం లేకపోవడం వంటి కారణాలతోనే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నట్టు వివరించారు. www.tslprb.inలో ప్రిలిమనరీ కీ అందుబాటులో ఉన్నందున అభ్యర్థులు వారి బుక్‌లెట్ కోడ్ ఆధారంగా సరిచూసుకోవచ్చని
అధికారులు సూచిస్తున్నారు.