పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 71వరోజు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎస్.రంగాపురం వద్ద లోకేశ్ వద్దకు మహిళలు వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు. సర్పంచ్ లు, డీసీ కొండ గ్రామస్తులు, కలచెట్ల గ్రామస్తులు తమ సమస్యలపై లోకేశ్ కు వినతిపత్రాలు అందించారు. వాటిపై లోకేశ్ స్పందించి తమ సమస్యలను అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకు కదిలారు. శభాష్ పురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. నియోజకవర్గం ప్రారంభంలో పత్తికొండ టీడీపీ నాయకులు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. మహిళలు పాదయాత్రకు పోటెత్తి తమ సంఘీభావం తెలిపారు రాంపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
లోకేశ్ మాట్లాడుతూ… పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఓ మహానటి అని విమర్శించారు. ఆమె కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని మాఫియాలా దోచుకుతింటున్నారని ఆరోపించారు. దళితుల భూములను లాక్కుని, బాధితులపై హత్యాయత్నం కేసులు పెట్టించి వేధిస్తోందని మండిపడ్డారు. శ్రీదేవి దోపిడీకి హద్దులు లేకుండా పోతున్నాయని, పత్తికొండ అభివృద్ధి చెందాలంటే మరోసారి పత్తికొండలో పసుపుజెండా ఎగరాల్సిందేని లోకేశ్ స్పష్టం చేశారు. అశోకుడు పరిపాలించిన ప్రాంతం పత్తికొండ అని లోకేశ్ వెల్లడించారు. వజ్రాల్లాంటి ప్రజలు పత్తికొండలో ఉన్నారని, నవ్యాంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడ నుండే ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. పెరవలి రంగనాథ స్వామి ఆలయం, పత్తికొండ సాయిబాబా ఆలయం ఉన్న పుణ్య భూమి ఇది అని కొనియాడారు. డోన్ నియోజకవర్గం పొలిమేరమెట్ట విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభమైంది.