రోజు రోజుకు కాలం మారుతుంది. ఎప్పుడూ ఎక్కడ ఏ సంఘటన జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కన్నతల్లి చేసిన పనికీ ప్రతీ ఒక్కరూ ఛీ ఛీ అనకుండా ఉండరు. ఇలాంటి ఘటన మానవత్వానికే మచ్చతెచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది. భీమిని మండల పరిధిలోని కేస్లాపూర్ గ్రామంలో నిన్న రాత్రి 8 నెలల వయసు గల నవజాత శిశువును గుర్తు తెలియని మహిళ గ్రామ శివారులోని చేనులో వదిలేసి వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ జన సంచారం లేకపోవడంతో వీధి కుక్కలు చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ ప్రమాదంలో నవజాత శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని చేనులో వదిలి వెళ్లిన నిందితురాలు గంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.