కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, విశ్లేషకులు వారాల ఆనంద్ కు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన సమావేశం లో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల మాట్లాడుతూ , సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తిమంతులు సాహితివేత్తలు, కవులని వెల్లడించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందడం ద్వారా కరీంనగర్ జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపినందుకు గర్వకారణంగా ఉందని ఆయనను అన్నారు. మూల రచయిత యొక్క కవితాత్మను, భావాలను పాఠకుల మనస్సుకు హత్తుకునేలా చేరవేశారని తెలిపారు. కరీంనగర్ ముద్దుబిడ్డ దేశ ప్రధాని పీవీ నరసింహారావు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారని,ఆ వారసత్వాన్ని ఆనంద్ కొనసాగించడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తపరిచారు.
కరీంనగర్ సాహిత్యానికి ఒక వేదిక ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నామని, దానిలో భాగంగా త్వరలోనే భూమి పూజ చేసి సాహితీ మందిరం నిర్మించి కవులను సత్కరించు కుంటామని హామీ ఇచ్చారు మంత్రి గంగుల.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జి వి శ్యాంప్రసాద్ లాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సాహితీగౌతమి కార్యనిర్వాహక అధ్యక్ష, కార్యదర్శులు గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట రామకృష్ణ, ప్రముఖ తమిళ కవి వీర రాఘవన్ , కవులు, సాహితివేతలు తదితరులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.