ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు మొత్తాన్ని ఉపసంహరించుకున్న విషయం విదితమే. ఆగస్టు 31 వరకు డెడ్‌లైన్ విధించడంతో ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే మెజారిటీ అమెరికన్ ప్రజలు మాత్రం అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం పట్ల అసంతప్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఆఫ్గనిస్థాన్ విషయంలో జో బైడెన్ అనుసరించిన వైఖరి పట్ల 61 శాతం మంది అమెరికన్లు ఆయన పట్ల వ్యతిరేకతను కనబరిచారు.
మేరిస్ట్ నేషనల్ పోల్, ఎన్‌పీఆర్, పీబీఎస్ న్యూస్ అవర్‌లకు చెందిన సర్వే ప్రకారం ఆఫ్గనిస్థాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకుని అమెరికా తప్పు చేసిందని, ఆ విషయంలో అమెరికా గానీ, అధ్యక్షుడు జో బైడెన్ గానీ సరిగ్గా వ్యవహరించలేదని మెజారిటీ అమెరికన్లు అభిప్రాయ పడ్డారు. జో బైడెన్‌తో 43 శాతం మంది మాత్రమే ఏకీభవించగా, 56 శాతం మంది విభేదించారు. ఇక ఆఫ్గనిస్థాన్ విషయంలో జో బైడెన్ అనుసరించిన వ్యవహార శైలి పట్ల 61 శాతం మంది అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు. జో బైడెన్ సొంత పార్టీకి చెందిన నేతలే ఆయన వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలో తేలింది.
కాగా గతంలో పనిచేసిన అధ్యక్షులతో పోలిస్తే అమెరికన్ల నుంచి ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నవారిలో బుష్ మొదటి స్థానంలో ఉన్నారు. తరువాత స్థానంలో జో బైడెన్ నిలవడం విశేషం. ఆ తరువాత ఒబామా నిలవగా చివరి స్థానంలో ట్రంప్ నిలిచారు.