ఫస్ట్ కాజ్ : మినీ మహానాడు లో బుధవారం వినిపించిన బూతులు తరువాత వినిపించిన వ్యాఖ్యలు వీటన్నింటిపై వివాదాస్పద మంత్రి అమర్నాథ్ స్పందించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా, చోడవరం కేంద్రంగా ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన మినీ మహానాడు ఘన విజయం అందుకుంది. విపరీతంగా జనం వచ్చారు. పార్టీ శ్రేణుల రాకతో ఒక్కసారిగా ఈ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రజా ప్రభంజనం గమనించాక 70 ఏళ్ల వయస్సులోనూ రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు భావోద్వేగ భరితంగా ప్రసంగించారు.ఈ నేపథ్యంలో అనకాపల్లి ఎమ్మెల్యే, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెనువెంటనే అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి స్పందించారు. తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
పాలక పార్టీ నుంచి విపక్ష పార్టీకి కౌంటర్లు పంపారు. ముఖ్యంగా అది మహానాడు కాదని బూతుల నాడు అని వ్యాఖ్యానించారు. మహానాడు పై ఇంకా ఆయనేమన్నారంటే..‘పార్టీలో నాయకులు, కార్యకర్తల కొరతతో టీడీపీ మినీ టీడీపీగా తయారైంది. 14 ఏళ్ల సీఎంగా ఉండి వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వానికంటే మెరుగ్గా పథకాలు ప్రజలకు అందించానని, సీఎం వైయస్ జగన్‌కంటే బాగా పాలన చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారాయన.
ఇక చంద్రబాబు తన మనుషులతో ఇటు అధికార పార్టీ నాయకులను తిట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా అయ్యన్నను ఉద్దేశించి కూడా మంత్రి మాట్లాడుతూ మందు తాగితే కానీ మాట రాని అయ్యన్నతో తిట్టించడం సబబు కాదని ఫైర్ అయ్యారు. ఇదే సందర్భంలో ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? అని సవాల్ విసిరి, సరికొత్త చర్చకు తావిచ్చారు. మరి! వీటిపై టీడీపీ ఏమంటుందో ?
ఎపార్ట్ ఫ్రమ్ దిస్ … ఇప్పటిదాకా అమర్నాథ్ చెప్పిన మాటలు కానీ చేసిన వ్యాఖ్యలు కానీ గతంలో వైసీపీ అనేక సార్లు చేసినవే ! వీటిలో కొత్తదనం లేదు కానీ కొన్ని ఆలోచింపజేస్తున్నాయి. అదేటంటే ఉత్తరాంధ్రకు 14ఏళ్ల టీడీపీ ఏంచేసింది మూడేళ్ల వైసీపీ ఏంచేసింది అన్నది తేలిపోతే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఏంటన్నది ? ఎవరు ఎలా పనిచేయనున్నారో ? అన్నది కూడా స్పష్టం అయిపోతుంది.