ఆంధ్రావనిలో ఇప్పటికే అప్పులతో నడుస్తున్న ప్రభుత్వానికి మరో కొత్త అప్పు పుట్టిందన్న వార్త సంబంధిత వర్గాలకు మరియు మద్దతుదారులకు ఓ ఊరట.నిజంగానే ఊరట.ఇప్పటికే మూడున్నర లక్షల కోట్ల మేరకు అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ కు ఇప్పుడొక కొత్త అప్పు దొరికింది.అదేంటంటే రహదారుల అభివృద్ధికి, అదేవిధంగా అర్ధంతరంగా ఆగిపోయిన వంతెనల నిర్మాణానికి వెయ్యి కోట్లకు పైగా అప్పు పుట్టింది.రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, వంతెనలు నిర్మాణానికి నోచుకోక ఆగిపోయి ఉన్నాయి. పనుల్లో కదలిక లేదు.ఈ కారణంగా వాటిని పూర్తి చేసేందుకు నాబార్డ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (నిడా) ఇందుకు తగ్గ నిధులను అప్పు రూపేణా అందించేందుకు సుముఖంగా ఉంది.
మూడేళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపుతో పాటు అర్ధంతరంగా ఆగిపోయిన పనుల్లో కదలిక కోసం 14 ఆర్ఓబీలు,34 వంతెనల నిర్మాణానికి, అదేవిధంగా ఆగిపోయిన రహదారుల పూర్తికి 1168 కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.ఇందుకు సంబంధించిన నిధులు రుణ రూపేణ ఇప్పటికే విడుదల అయ్యాయి.ఇంకేం మూడేళ్లుగా ఆగిపోయిన పనులలో కదలిక వస్తుందని ఆశించవచ్చా? లేదా ఇవి కూడా ఖర్చు చేసి మళ్లీ అప్పు అని బయలు దేరుతారా అని టీడీపీ తరఫు విమర్శ వినిపిస్తోంది.వైసీపీ అధికారంలోకి వచ్చాక రహదారి పనుల్లో కదలిక లేదన్న విమర్శను తిప్పికొట్టేలా ఇప్పటికైనా ఓ సమాధానం కార్యాచరణ రూపంలో దొరికితే చాలు.
రైల్వే క్రాసింగ్ ల వద్ద ఆర్వోబీ నిర్మించాల్సిన ప్రాంతాలివే..
- నెల్లూరు జిల్లా గూడురు,కావలి
- గుంటూరు జిల్లా నంది వెలుగు
- పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు
- తూర్పుగోదావరి జిల్లా కాకినాడ
- చిత్తూరు జిల్లా కరకంబాడి
- కృష్ణా జిల్లా గుణదల
- శ్రీకాకుళం జిల్లా పలాస