అగ్నిప‌థ్ : ఆ అగ్గి ఆగితే చాలు.. ! ఆంధ్రా అల‌ర్ట్ !  

-

నిన్న‌టి వేళ యావ‌త్ దేశం ఉద్రిక్త‌త‌లతో, అల్ల‌ర్ల‌తో అశాంతితో నిండిపోయింది. నిన్న‌టి శుక్ర‌వారం రైల్వే పోలీసుల‌కు ఇంకా ఇత‌ర ర‌క్ష‌ణ ద‌ళాల‌కూ ఎన్నో స‌వాళ్లు విసిరింది. రాళ్లు మీద ప‌డుతుంటే  నిలువ‌రించ‌లేని అస‌హాయ‌తతో కొన్ని ర‌క్ష‌ణ మూక‌లు చూస్తూ ఉండిపోయాయి. తుపాకీ చ‌ప్పుళ్ల కార‌ణంగా కాస్త ఆగిన అల్ల‌ర్లు, త‌రువాత ఎప్పుడ‌యినా ప్రారంభం కావొచ్చు అన్న ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి.
ఒక నిండు ప్రాణం బ‌లైపోయింది. రాకేశ్ అనే కుర్రాడి ప్రాణంపోయింది. ఈ ఘ‌ట‌న చుట్టూ య‌థావిధిగా మాట్లాడే రాజ‌కీయం కార‌ణంగా మ‌ళ్లీ మ‌ళ్లీ అశాంతి రేగేందుకు వీలుంది. వీలైనంత వ‌ర‌కూ మ‌న నాయ‌కులు రాజ‌కీయం  కాకుండా ప్ర‌జ‌ల‌కు ఏదైన మేలు చేసే ప‌నులు ఎంచుకుంటే  ఎంతో మేలు. కానీ అది త‌ప్ప మిగ‌తావ‌న్నీ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల కార‌ణంగా కొన్ని మూక‌లు రెచ్చిపోయి నాలుగు గంట‌ల‌కు పైగా సికింద్రాబాద్ లో జ‌న జీవనాన్ని స్తంభింప‌జేశారు. రాళ్లు రువ్వితే కేంద్రం దిగివ‌స్తుందా? ఈ నేప‌థ్యంలో ఆంధ్రావ‌ని వాకిట ముఖ్య స్టేష‌న్లకు చెందిన నిఘావ‌ర్గాల‌న్నీ అప్ర‌మ‌త్తం అయ్యాయి.

అగ్నిప‌థ్ పేరిట ఆర్మీలో నియ‌మాకాలు వ‌ద్దంటూ దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు రేగుతున్న నేప‌థ్యాన ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ అప్ర‌మ‌త్తం అయింది. ముఖ్యంగా ఇక్క‌డ ప్ర‌ధాన రైల్వే స్టేష‌న్ల‌లో భ‌ద్ర‌త‌ను పెంపుద‌ల చేసింది. అదేవిధంగా ప‌లుచోట్ల అనుమానితులు ఉంటే వారిని సైతం అదుపులోకి తీసుకుని విచారించేందుకు రైల్వే  పోలీస్ బృందం స‌న్న‌ద్ధం అవుతోంది. రైల్వే ప్రొటక్ష‌న్ ఫోర్స్, ప్ర‌భుత్వ రైల్వే పోలీసు, సివిల్ పోలీసులు భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేస్తున్నారు.  ప్ర‌ధాన రైల్వే  స్టేష‌న్ల‌యిన విజయ‌వాడ, తిరుప‌తి, విశాఖ ప‌ట్నం, గుంటూరు, గుంత‌క‌ల్ల‌తో సహా ప్ర‌ధాన రైల్వే స్టేష‌న్లంటినీ మ‌రోసారి త‌నిఖీలు చేస్తున్నారు. ఎక్క‌డ అల్ల‌ర్లు జ‌ర‌క‌కుండా ప్ర‌యాణికుల‌కు ఏ ఇబ్బందులు త‌లెత్త‌కుండా సంబంధిత వ‌ర్గాలు అప్ర‌మ‌త్త‌తతో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. రైల్వే క్వార్టర్స్, రైల్వే కార్యాలయాల వ‌ద్ద పహారా పెంచారు. అదేవిధంగా స్టేష‌న్ల‌లో ప్ర‌వేశ ద్వారాల వ‌ద్ద కూడా నిఘా పెంచారు. రైల్వే ట్రాప్ పై ఎవ్వ‌రూ రాకుండా అక్క‌డ కూడా నిఘా ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news