అధికార పార్టీని విమర్శించవచ్చు కానీ మరీ! అదుపు తప్పిన భాషలో మాట్లాడుతూ విచక్షణను కోల్పోకూడదు. అదేవిధంగా అధికార పార్టీ తప్పిదాలను వెలుగులోకి ఆధారాలతో సహా తేవచ్చు కానీ సీఎం స్థాయి వ్యక్తిని ఉద్దేశించి కనీస మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం తగదు. ఇవే ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.ఆయన ఎప్పటికప్పుడు ఏ వేదిక దొరికినా నోటికి వచ్చిన విధంగా వైసీపీ పెద్దలను తిడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలను సహిస్తాం కానీ మరీ ఇంత దిగజారుడు భాషను ఒప్పుకోలేం అని వైసీపీ అంటోంది. అందుకే ఆయనపై పోలీసు చర్యలు తప్పవని కూడా స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో అమలు అవుతున్న చెత్త పన్నుతో సహా ఇతర పన్నులపై అభ్యంతరాలుంటే చెప్పవచ్చు.. కానీ ఓ సీఎం స్థాయి వ్యక్తిని స్థాయి మరిచి ఓ మాజీ మంత్రి తిడుతూ ఉంటే ఎలా ఊరుకుంటామని వైసీపీ ప్రశ్నిస్తోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లా, నరసరావు పేటలో జరిగిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా, నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేసి, 41 ఏ నోటీసు ఇష్యూ చేశారు. కోడెల విగ్రహ ఆవిష్కరణ సభలో అసభ్య పదజాలంతో సీఎంను దూషించిన ఘటనలో అక్కడి అంటే అదే నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటికే నోటీసులు అందించేందుకు నర్సీపట్నం వెళ్లిన పోలీసులకు ఆయన ఇంట్లో లేకపోవడంతో చుక్కెదురు అయింది. వైద్య పరీక్షల నిమిత్తం బయటకు వెళ్లారని ఆయన కుమారుడు విజయ్ చెప్పారు. దీంతో సోమవారం వస్తామని పోలీసులు ఆయనకు చెప్పి వెళ్లారు.
చాలా రోజుల నుంచి వైసీపీ అధినేత పై అనుచిత రీతిలో, రాయలేని భాష లో అయ్యన్న తిడుతున్నారు అనేందుకు ఆధారాలున్నాయి. అయితే వీటిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగడం కాస్త ఆశ్చర్యకరం.ఓ సీఎం స్థాయి వ్యక్తిని ముందూ వెనుకా చూడకుండా నోటికి వచ్చిన విధంగా తిడుతుంటే, అవన్నీ వివిధ ఛానెళ్ల ద్వారా లైవ్ టెలికాస్ట్ అవుతుంటే ఎందుకని పోలీసులు హుటాహుటిన ఆ రోజు సంఘటనా స్థలానికి చేరుకుని అరెస్టు చేయలేకపోయారు ? అన్న ప్రశ్న కూడా ఇవాళ వినిపిస్తోంది.