వైఎస్ కుటుంబం ఎదిగిందే బీసీల సమాధులపై – బుద్దా వెంకన్న

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న. వైఎస్ కుటుంబం ఎదిగిందే బీసీల సమాధులపై అని.. ఆ విషయం అందరికీ తెలుసు అన్నారు. బీసీల బ్రతుకులను జగన్ చట్టబద్ధంగా నాశనం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ఉన్నఫలంగా బీసీలపై ప్రేమ పుట్టుకు రావడం అంతా ఎన్నికల స్టంట్ లో భాగమేనని విమర్శించారు.

బీసీలకు మంచి, న్యాయం చేయాలన్న ఆలోచన ఏ కోశానా జగన్ రెడ్డికి లేదని అన్నారు. చంద్రబాబుకి వస్తున్నావా ప్రజాదరణ చూసి ఓర్వలేకనే జగన్ బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. ఎన్ని సభలు పెట్టినా, తలకిందులుగా తపస్సు చేసినా జగన్కు బీసీల మద్దతు లభించదని స్పష్టం చేశారు బుద్ధ వెంకన్న. నలుగురికి పదవులు ఇస్తే బీసీలకు మేలు చేసినట్లు కాదని వ్యాఖ్యానించారు. బీసీలకు చంద్రబాబు చేసిన మేలు, జగన్ రెడ్డి చేసిన ద్రోహం పై చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు.