కొందరు అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మానవత్వంతో వ్యవహరించడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు అధికారులు కావాలనే వ్యవహరిస్తున్నారన్న సీఎం చంద్రబాబు… ఇకపై చర్యలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని… లోతట్టు ప్రాంతాల్లో ఉండే చివరి వ్యక్తికి సాయం అందాలని తెలిపారు. ఏ విధంగానైనా సాయం చేయాలని స్పష్టం చేశానని పేర్కొన్నారు.
ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేశామని… వార్డు సచివాలయాల పరిధికే ఫుడ్ సరఫరా చేపడతామన్నారు. ఇళ్లల్లోకి పాములు, తేళ్లూ వస్తున్నాయని… అధికార, పోలీసు యంత్రాంగం సరైన రీతిలో వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు బాధతో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా అధికారులు వ్యవహరించాలన్నారు. తప్పు జరిగితే సహించను.. కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారం రప్పించుకుంటున్నామన్నారు. ప్రజలూ సంయమనం పాటించాలి….బాధితులకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు బాబు.