రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో అక్కడక్కడ తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలో ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్.బి.కెల ద్వారా ధాన్యం సేకరించి 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తామన్నారు.
కనీస మద్దతు ధరతో పాటు గోనె సంచుల డబ్బులు, హమాలీ చార్జీలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్ల జోక్యం తగదని.. అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామని అన్నారు. ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులు తమ పంటను నేరుగా ఆర్బికేల వద్దకు తీసుకుని రావాలని సూచించారు. రైతుల ముసుగులో కొందరు ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తున్నారని.. అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు.