ప్రభుత్వంలో ఉన్న నేతలు కోవర్టులుగా ఉంటే.. ప్రతిపక్షం కనుసన్నల్లో పనిచేస్తుంటే.. వారిని సరిచేయొచ్చు. లేదా వచ్చే ఎన్నికల్లో వారిని పక్కన పెట్టొచ్చు. కానీ, ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు చేరువేయడంలో కీలకమైన అధికారులు కూడా కోవర్టులుగా మారితే.. ప్రతిపక్షం కనుసన్నల్లో పనిచేస్తూ.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. ఏం చేయాలి? ఇప్పుడు వైసీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిన ప్రశ్న ఇది! కొందరు అధికారులు ఐఏఎస్ రేంజ్‌లో ఉంటే.. ఇప్పుడు అధికారులు ఎస్పీ, డీఎస్పీ స్థాయిలో ఉంటున్నారనేది వైసీపీ నేతల మాట.
గతంలో చంద్రబాబు హయాంలో తమకు అనుకూలంగా పోస్టులు తెప్పించుకున్న కొందరు డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే వాదన బలంగానే వినిపిస్తోంది. ఐఏఎస్‌లు అయితే.. సర్కారు కార్యకలాపాలను లీకు చేస్తున్నారనే విషయంలో జగన్ అప్రమత్తమయ్యారు. సీఎంవోలోనే కీలక అధికారులు క్లూలు ఇస్తున్నారని తెలుసుకుని అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. దీంతో ఇది కొంత మేరకు పలితాన్ని ఇస్తోంది.
కానీ, క్షేత్రస్తాయిలో ఉన్న అధికారులు ముఖ్యంగా ప్రజలతో నిత్యం కనెక్ట్ అయ్యే పోలీసులు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే.. ఇప్పుడు వీరి వైపే.. వైసీపీ నేతల వేళ్లు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే.. రైతులకు బేడీలు వేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ, ఇది ఓ అధికారి ఉద్దేశ పూర్వకంగా చేయించారనే వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై సర్కారు విచారణకు ఆదేశించింది. రైతులకు బేడీలు వేయడం ద్వారాప్రభుత్వానికి ఇబ్బందులతో పాటు ప్రతి పక్షాలకు పనిచక్కింది.
అదే సమయంలో గుంటూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే సీఐతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగును కూడా అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి బయట పెట్టారు. దీనిపైనా విచారణ కొనసాగుతోంది. ఇక, విశాఖలో డాక్టర్ సుధాకర్ విషయంలోనూ ఓ అధికారి హస్తం ఉందని తెలిసి.. ప్రభుత్వం ఆయనను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇలా.. ప్రభుత్వంలో పనిచేస్తున్నవారే ప్రతిపక్షానికి న్యాయం చేయాలనే విధంగా కోవర్టులుగా మారి.. అధికార దుర్వినియోగం చేయడం ఎప్పుడూ చూడలేదని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై సీఎం కూడా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.