జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు.. దీంతో వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్దమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ధర్మ పోరాట చేసాడు. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి పవన్ క్షుద్రపూజలు చేస్తున్న విధంగా చిత్రీకరించి అసభ్య పదజాలంతో దూషిస్తూ ప్రచారం చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. దీంతో వాళ్ళపై ఫిర్యాదు చేసిన జనసైనికులు.. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇకపోతే ఈ అగ్ని ప్రమాదంపై గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఈ ఘటనలన్నీ యాదృచ్ఛికాలు కావన్నారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా? అని ఏపీ ప్రభుత్వాన్ని జనసేనాని ప్రశ్నించారు. ఈ విషయంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని సర్కారుని డిమాండ్ చేశారు పవన్. ఒకవేళ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరతామని చెప్పిన పవన్.. ఉగ్రవాద కోణం ఉన్నట్టయితే ఎన్ఐఏ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.