పచ్చని గోదావరి సీమలో జరిగిన ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యోదంతం (?) కు సంబంధించి దర్యాప్తు మరో మలుపు తీసుకోనుంది. ఆ వివరం ఈ కథనంలో..
పోలీసులూ, మంత్రి వర్గానికి చెందిన మనుషులూ ఒక్కటే చెబుతున్నారు అది హత్యేనని ! కానీ మొదట్లో వచ్చిన విధంగా అనుమానాస్పద మృతి అనో లేదా మరొక్కటో ఇంకొక్కటో అనో అనేందుకు వీల్లేకుండా ఉందని బాధిత వర్గం ఆరోపిస్తుంది. కాకినా డ ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్టు చేస్తారా ? ఈ సాయంత్రంలోగా అరెస్టు చేస్తారా ? ఇవీ ఇప్పుడు రేగుతున్న ప్రశ్నలు. గాలింపు చర్యలు ఏమయ్యాయి..ఐదు బృందాలు ఏం సాధించాయి? అన్నవి కూడా దళిత సమాజం అడుగుతోంది. డీజీపీ రాజేంద్ర నాథ్ తీరుపై మాత్రం బాధిత వర్గాలు మండిపడుతున్నాయి. అధికార పక్షంలో కొందరు దళిత నాయకులు కూడా ప్రభుత్వ తీరుపై గుస్సాగానే ఉన్నారు. ముఖ్యమంత్రి ఊళ్లో లేని సమయంలో విపక్షాలకు అస్త్రాలు దొరికాయని అంతర్మథనం చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ సంచలన నిజాలే చెప్పింది. హత్య అని ధ్రువీకరించి, మరిన్ని అనుమానాలు బలపడేందుకు ఆస్కారం ఇచ్చింది.
ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి పలు వివాదాలకు తావిస్తోంది. తాజాగా మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానిస్తున్న విధంగా ఇది హత్యే అని తెలుస్తోంది. బాధిత వర్గాల ఆరోపణ కూడా ఇదే ! ఇవాళ విడుదలయిన ఫోరెన్సిక్ నివేదిక కూడా హత్యే అని తేల్చి చెబుతోంది. దీంతో వైసీపీ వర్గాలు డైలమాలో పడ్డాయి. ఓ దళితుడు అత్యంత అనుమానాస్పద స్థితిలో చనిపోతే మరో దళిత హోం మంత్రి మాట్లాడకపోవడం ఏంటన్నది విపక్షాల ప్రశ్న. ఆయన్ను తీవ్రంగా కొట్టడం వల్లనే చనిపోయాడు అన్న వాస్తవం ఒకటి ఫోరెన్సిక్ రిపోర్ట్ ధ్రువీకరిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పై కేసు నమోదు చేశామని మంత్రి మేరుగ అన్నారు. దళితులపై ఎవ్వరు దాడులు చేసినా ఒప్పుకోం అని హెచ్చరించారు. దళితులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించి, విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ను అరెస్టు చేస్తారా లేదా అన్న విషయమై ఇప్పటికే చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఆయన అజ్ఞాతంలో ఉన్నారని కొన్ని వర్గాలు చెబుతున్నా, మీడియా మాత్రం వివిధ శుభ కార్యాలకు హాజరైన ఫొటోలను ప్రముఖంగా ప్రచురించింది. వీటినే ఆధారంగా చేసుకుని ఆయన్ను అరెస్టు చేయాలని దళిత వర్గం పట్టుబడుతోంది. ప్రజా సంఘాలు కూడా రోడ్డెక్కేందుకు సిద్ధం అవుతున్నాయి. మరి! ఈ వివరంపై ఈ హత్యోదంతంపై (?) ముఖ్యమంత్రి వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో అన్నది ఆసక్తిదాయకంగానే ఉంది.