తిరుమల శ్రీవారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దర్శించుకున్నారు. రేపటి నుంచి ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. లోకేశ్ తిరుమల రాక సందర్భంగా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. లోకేశ్ తిరుమల నుంచి నేరుగా కుప్పం వెళ్లనున్నారు. రేపు ఉదయం అక్కడి శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభిస్తారు. మరోవైపు పాదయాత్రకు టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఏపీలోని యువత సమస్యల ప్రక్షళానానికి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. యువగళం పేరిట 400 రోజులు 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి రేపు ప్రారంభమయ్యే యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవానికి పార్టీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేపడుతున్నాయి. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపడుతున్నారు. కుప్పం పట్టణంలో పెద్ద ఎత్తున కటౌట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.