ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవడంతో విజయవాడ అతలాకుతలమైన విషయం తెలిసిందే. తాజాగా సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. తనతో సహా మంత్రులు, అధికారులు బురదలోనే తిరుగుతున్నారని చెప్పారు. దాదాపు తొమ్మిది రోజులుగా ప్రజలు పడిన బాధలు వర్ణణాతీతమన్నారు.
బుడమేరుకు గండ్లు పడినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఎన్నో కష్టాలున్నాయి. పదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి జగన్ గద్దె దిగిపోయారని పేర్కొన్నారు. జగన్ వచ్చి ఈ బురదలో తిరిగి ఉంటే.. చేసిన పాపాలు కొన్ని అయినా పోయేవని.. కానీ బెంగళూరులో కూర్చొని మా ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మహాయజ్ఞంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు.