ఏపీకి అమరావతే రాజధాని..వచ్చేది బీజేపీ సర్కారే అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని.. రాజధాని పై హైకోర్టు తీర్పు అనంతరం సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. అఫిడవిట్ వివరాలు కోర్టు పరిధిలో ఉంటాయని… అయితే ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో ఇచ్చిన ప్లాట్లుకు పనులు పూర్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తగిన సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని.. వందల రోజులు రాజధాని రైతులు ఉద్యమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బెట్టు మాని ఒక మెట్టు దిగి వ్యవహరించాలని.. రెండు ప్రభుత్వాలు రైతులు జీవితాలతో ఆటలాడుకున్నాయని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు.
రాజధాని రైతులకు సమయపాలనతో కూడిన షెడ్యూల్ ఇచ్చి సమస్య పరిష్కారం చేయాలి.. ఈవిధంగా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని.. రాజధాని రైతుల సమస్య సజీవంగా ఉంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు కలిగించే రీతిలో వ్యవహరిస్తోందని.. బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు సమస్యలు ఒక టైమ్ షెడ్యూల్ ప్రకారం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.