చిత్తూరులో 50 కోట్ల రూపాయల విలువ గల ప్రైవేట్ భూముల గోల్ మాల్ రిజిస్ట్రేషన్ కేసును చేధించారు పోలిసులు. అందుబాటులో లేని భూమి యజమానుల కన్ను గప్పి , రిజిస్ట్రేషన్ , రెవెన్యూ శాఖ లోని డొల్లతనాన్ని ఉపయోగించుకొని కోట్లు గడించాలని ప్రయత్నించింది ఈ ముఠా. 12 మందిని గత వారం రోజులుగా విచారణ చేపట్టారు పోలీసులు. మొత్తం 9 అతి విలువైన భూములను నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇతురులకు ధారదత్తం చేశారు నిందితులు.
అందులో మొదటి కేసులో 7 గురు డాక్యుమెంట్ రైటర్ , వీఆర్వో, మహిళతో కూడిన ముఠాను అరెస్ట్ చేశారు పోలిసులు. మిగిలిన కేసుల్లో విచారణ జరుపుతున్నారు. విచారణల్లో పలువురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్ లు , బడా వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖుల పాత్ర ఉన్నట్టు సమాచారం. దీన్ని గోప్యంగా విచారణ జరుపుతున్నారు పోలిసులు. మెట్రో సిటీలలో జరిగే భూదందాలను తలదన్నే విధంగా స్కాం కు తెగబడ్డారు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు అక్రమార్కులు. ఖాళీ భూములు , యజమానులు విదేశాల్లో ఉన్న భూములు, వారసులు లేని భూములు లే ఈ అక్రమార్కులకు జాక్ పాట్.
ఇందులో కొసమెరుపు అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా పొందిన ఇందులో ఒక భూమిని బెంగళూరు లోని సిటీ యూనియన్ బ్యాంక్ లో 18 కోట్లు లోను పొందాడు నరసింహులు నాయుడు అనే వ్యక్తి. ప్రస్తుతం పరారీ లో ఉన్నాడు నిందితుడు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు పోలిసులు.