తిరుపతి సర్వ దర్శనం టికెట్లను నేటి నుంచి టీటీడీ ఆఫ్ లైన్ లోనే జారీ చేయనుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లను టీటీడీ సిద్ధం చేసింది. ఉదయం 9 గంటల నుంచే ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శనం టికెట్లను జారీ చేయనుంది. అయితే దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో ఇప్పటి వరకు సర్వ దర్శనం టికెట్లు కూడా ఆన్ లైన్ లోనే టీటీడీ విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో విడుదల చేసిన సర్వదర్శనం టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నేటి తిరుపతి సర్వ దర్శనం టికెట్లు ఆఫ్ లైన్ లోనూ అందుబాటులో ఉండనున్నాయి. టికెట్లను జారీ చేయడానికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజ స్వామి సత్రాలల్లో కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రోజుకు పది వేల చొప్పున సర్వ దర్శనం టికెట్లను విడుదల చేయాలని టీటీడీ భావిస్తుంది.