ప్రజారాజ్యం విలీనానికి మొదటి కారణం పవన్ కళ్యాణ్ – వెల్లంపల్లి

పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజారాజ్యంలో అసలైన కోవర్టు పవన్ కళ్యాణ్ అని.. చిరంజీవి 18 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కాగానే బయటకు వెళ్ళిపోయిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆగ్రహించారు వెల్లంపల్లి శ్రీనివాస్. యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా? ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం పీకాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం విలీనానికి మొదటి కారణం పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు వెల్లంపల్లి శ్రీనివాస్.

అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరు చివరి వరకు చిరంజీవితోనే ఉన్నారు.. చిరంజీవితో పాటు కాంగ్రెస్ లో మేము కొనసాగామన్నారు. సినిమా ఫంక్షన్ ‌లలో చిరంజీవిని అవమానించే విధంగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ కాదా?? తాను జనసేన పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి …. ఇప్పుడు చిరంజీవి అవసరం వచ్చిందని తెలిపారు. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు.. జగన్ కు, చిరంజీవికి మధ్య గ్యాప్ తీసుకుని రావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహించారు.

2014లో చంద్రబాబు సీఎమ్‌ కావటానికి పవన్ కళ్యాణ్ సహకరించింది వాస్తవం కాదా?? ఈ రాష్ట్రానికి 20 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగ వేదికలో పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం కాదా? అని ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి కావాలని కాని, కాపు సామాజిక వర్గానికి అండగా నిలబడాలని గాని ఉండదని… వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 20 చోట్ల పోటీ చేసినా ఓడిపోవటం ఖాయమని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్.