ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై సీఎం జగనుకు యనమల లేఖ రాశారు. రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం గత మూడున్నరేళ్లుగా అధోగతి పాలైంది…మైనస్ గ్రోత్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సున్నా పెట్టుబడుల అభివృద్ధి ప్రశ్నార్ధకమని లేఖలో యనమల పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పారిశ్రామిక, సేవా రంగాలు జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టాయి… వైసీపీ ప్రభుత్వ విధానాలతో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలో ఉన్నాయన్నారు.
ప్రభుత్వ విద్వేష, వికృత, విధ్వంసకర విధానాలతో పారిశ్రామిక వేత్తలు రావాలంటే భయపడుతున్నారు…. క్షీణించిన శాంతి భద్రతలు, క్విడ్ ప్రో క్వో, కమిషన్ల దోపిడీకి భయపడుతున్నారని వెల్లడించారు.
గత మూడున్నరేళ్లలో రూ. 17 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు పరారయ్యాయి…గత ప్రభుత్వ ఒప్పందాలు రద్దు, భూములు వెనక్కి తీసుకుంటూ రివర్స్ పాలన చేస్తున్నారని ఆగ్రహించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత నిర్వీర్యం అవుతోంది… మూడున్నరేళ్లుగా గ్రోత్ ఇంజన్లన్నీ రివర్స్ లో నడుస్తున్నాయని..ఎఫ్డీఐల ఆకర్షణలో 2018-19లో ఏపీ దేశంలో 3వ స్థానంలో ఉంటే.. ప్రస్తుతం 13వ స్థానంలో ఉందని లేఖలో యనమల తెలిపారు.