ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులు అంతా వైసీపీలోకి వచ్చేసారు. ఇంకా మరికొంత మంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. వారు కూడా రేపో మాపో ఖచ్చితంగా చేరిపోతారు. అందులో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో అంత సానుకూలమైన వాతావరణం కూడా ఉండేలా కనిపించకపోవడంతో, వారు కూడా టిడిపిలోకి వెళ్లేందుకు తహతహలాడిపోతున్నారు. అయితే అలా నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుంటే, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతాయనే విషయం జగన్ కు తెలియంది కాదు. అయినా చేరికలను ప్రోత్సహించడానికి కారణం లేకపోలేదు.
పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా మరో 50 కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండాలి. 2019 ఎన్నికలకు ముందే ఈ తతంగమంతా జరగాల్సి ఉన్నా, కేంద్రం స్పందించకపోవడంతో అది కాస్తా వాయిదా పడింది. అయితే ఇప్పుడు వైసీపీ విషయంలో బిజెపి సానుకూలంగా ఉండడంతో, ఏపీలో పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాలను పెంచాలని జగన్ కేంద్ర బిజెపి పెద్దలను కోరినట్టు వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఆ ఉద్దేశంతోనే నాయకుల చేరికలకు ఈ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపు రాజకీయాలకు తెరదించినట్లు అవుతుందని, అదే సమయంలో తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందనేది జగన్ ప్లాన్ గా కనిపిస్తోంది. జగన్ కోరినట్లుగా పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం అసెంబ్లీ స్థానాలను పెంచేందుకు ఒప్పుకుంటే, జగన్ కు మరింత అడ్వాంటేజ్ అవుతుంది.