నెల్లూరు.జిల్లా మర్రిపాడు(మ)వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ కలకలం రేపిన సంఘటనపై మంత్రి ఆనం స్పందించారు. అనారోగ్యంతో ఆరేళ్ళ బాలుడిని నెల్లూరు లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.. జికా వైరస్ నిర్ధారణ కావడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు వైద్యులు. ఇక జికా వైరస్ పై స్పందించిన మంత్రి ఆనం.. వ్యాధి సోకిన బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తామని ప్రకటన చేశారు.
వ్యాధి నిర్ధారణ కోసం బాలుడి బ్లడ్ శాంపిల్స్ ను పూణే ల్యాబ్ కు అధికారులు పంపుతారని వివరించారు. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటన చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని… గ్రామంలో మొత్తం 150 గృహాలు ఉన్నాయన్నారు. ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జ్వరాలు సోకిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాము..అపోహలు నమ్మవద్దన్నారు. అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.