ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఈరోజు ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. భారీ పేలుడు సంభవించి సుమారు ఆరుగురు పౌరులు తమ ప్రాణాలు విడిచారు, పలువురు గాయపడ్డారు. ఆప్ఘన్ విదేశాంగ కార్యాలయానికి సమీపంలో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన జరిగినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. రంజాన్ పవిత్ర మాసం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా విధులు పూర్తి చేసుకుని బయటపడుతున్న తరుణంలో, జనంతో రద్దీగా ఉంటే లంచ్ సమయంలో ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకున్నట్టు సమాచారం.
ఆత్మాహుతి బాంబర్ తన లక్ష్యం వైపు దూసుకువెళ్లుండగా మాలిక్ అష్ఘుర్ స్క్వేర్ వద్ద అతన్ని కాల్చిచంపామని, ఇదే సమయంలో అతను తనను తాను పేల్చేసుకున్నాడని కాబూల్ పోలీస్ ప్రతినిధి ఖలిద్ జడ్రాన్ తెలియచేశారు. ఈ పేలుడులో ముగ్గురు తాలిబన్ భద్రతా సిబ్బందితో పాటు సహా పలువురు గాయపడినట్టు సమాచారం. అయితే, ఆత్మాహుతి బాంబర్ టార్గెట్ ఏమిటనేది ఆయన వెల్లడించలేదు. చెక్‌పాయింట్ సమీపంలో విదేశాంగ శాఖ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ భవంతులు ఉన్నాయి. దీంతో విదేశాంగ కార్యాలయమే ఆత్మాహుతి బాంబర్ టార్గెట్ కావచ్చని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. రెండు మృతదేహాలతో పాటు క్షతగ్రాతులను సమీపంలో ఇటాలియన్ ఎన్జీఏ ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించడం జరిగింది.