ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. అయితే.. ఏపీ అసెంబ్లీలో మొత్తం 9 బిల్లులు ఆమోదం పొందాయి. బుధవారం మూజువాణి ఓటుతో తొమ్మిది బిల్లులను ఆమోదించింది సభ. ఈ బిల్లుల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా సవరణ బిల్లును ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రి విడుదల రజిని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాంతో ఒక్కసారిగా విపక్ష టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సవరణ బిల్లు ప్రతులను స్పీకర్ కుర్చీపైకి విసరడంతో.. టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సవరణ) బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ (రెండవ సవరణ) బిల్లు 2022, కార్మిక ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలశాఖ మంత్రి జీ జయరామ్ ప్రవేశపెట్టారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ జీతాలు, పెన్షన్ చెల్లింపులు, తొలగింపుల అనర్హత (సవరణ) బిల్లు 2002 కూడా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్‌కు నియామకాల నియంత్రణ, స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్ (సవరణ) బిల్లు 2022 కూడా ఆమోదం పొందింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (సవరణ) బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ (సవరణ) బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు 2022 లను కూడా సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ విభజన (నం.3) బిల్లు 2022 ను కూడా సభ ఆమోదించింది. బిల్లులు అన్నీ కూడా మూజువాణి ఓటుతో ఆమోదించడం విశేషం.