ఇవాళ కొత్త పీఆర్సీ వద్దని సంబంధిత జీఓలు వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి.కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించాయి.ఫ్యాఫ్టో తో సహా ఇతర ఉద్యోగ సంఘాలు తమ నిరసనలను తెలిపాయి.తమకు కొత్త పీఆర్సీ ఇవ్వాలని అయితే అది తాము కోరుకున్న విధంగా ముప్పయి శాతం ఫిట్మెంట్ తో ఇవ్వాలని వేడుకుంటూ, పాత శ్లాబు విధానంలోనే అద్దెభత్యం చెల్లించాలని కోరుతూ.. ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు రోడ్డెక్కారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉదయం పది గంటలకే నిరసన ప్రారంభం అయింది. పోలీసులు మాత్రం ఎక్కడిక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే పక్కా గా చేశారు. అంతేకాదు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉద్యోగులు తమ నిరసన తెలియజేసుకునే అవకాశం ఉందని, అందుకు తగ్గ దారులేవో వెతుక్కోవాలని కూడా ఉద్యోగులకు పోలీసులు హితవు చెప్పారు.
మరోవైపు సీపీఎస్ రద్దు లాంటి కీలక సమస్యే పరిష్కారం కాక ఉద్యోగులు తలలుపట్టుకుంటుంటే ఇప్పుడు వచ్చిన కొత్త పీఆర్సీపై ఏం మాట్లాడాలో తెలియక గందరగోళం అవుతున్నారు. ఒక్క నెల రోజులు ఆగితే కొత్త పే స్లిప్ వస్తుందని దానికి అనుగుణంగా మీ జీతాలు ఎంతున్నాయి ఎంత పెరిగాయి అన్నవి తేలిపోతాయి అని సీఎస్ చెబుతున్నారు.అయితే ఉద్యోగులు మాత్రం అందుకు ససేమీరా అంటున్నారు.
జీతం పెంపుదల అన్నది తమకు పీఆర్సీ నుంచి రావాల్సిన హక్కు అని మీరు డీఏలు కలుపుకుని లెక్కబెట్టుకోమని చెప్పడం సబబు కాదని అంటున్నారు. ఏదేమయినప్పటికీ ఉద్యోగుల వాదన ఎలా ఉన్నా సర్కారు మాత్రం మొండిగానే ఉంది. డీఏ బకాయిలు క్లియర్ చేసి కొత్త వేతనం ఇవ్వాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి కొత్త సాఫ్ట్ వేర్ కూడా సిద్ధం చేశారని కూడా సమాచారం.అలాంటప్పుడు సమస్య ఎలా పరిష్కారం అవుతుంది. సో.. జీవోల ఉపసంహరణ అన్నది సాధ్యం కాని పని.ఇదే సమయంలో జగన్ ఏం చెబితే అదే చేయాల్సిన గత్యంతరం ఉద్యోగిది. ఇలాంటి సందర్భాల్లో ఉద్యమాలు చెల్లవు. కేవలం సంప్రతింపులే శరణ్యం. కానీ ఉద్యోగులు అందుకు సిద్ధంగా లేరు. సంఘాల నాయకులు కూడా ఇప్పుడు పూర్తిగా విసిగి ఉన్నారు. కనుక ఈ సమస్య ఇప్పట్లో తేలదు కొత్త జీతం వచ్చేదాకా ఆగాల్సిందే! అప్పుడు జగన్ చెప్పింది నిజమా ఉద్యోగి చెప్పేది నిజమా అన్నది తేలిపోవడం ఖాయం.