టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ అరెస్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. కేసు డైరీ చూశాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ విచారణ రేపటికి వాయిదా వేసింది. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ అరెస్టుకు సంబంధించి దాఖలైన లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్టు, కేసులో పొందుపరిచిన సెక్షన్లు, ఎన్‌ఓసీ తదితర అంశాలపై న్యాయవాదులు వాదనలు వినిపించారు.
నిందితులపై పెట్టిన కేసులు చెల్లుబాటు కావని, ఇదంతా రాజకీయ ఉద్దేశంతోనే చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు పూర్తి స్థాయిలో విచారణ జరిపామని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 0.02 సెంట్ల భూమి ఆక్రమించారని తమ వద్ద ఆధారాలున్నాయని, ఎన్‌ఓసీ కూడా ఫోర్జరీ చేశారని తెలిపారు. భూమి విలువ రూ.10వేలకు పైగా ఉందని.. అందుకే 41ఏ నోటీసులు ఇవ్వలేదన్నారు. అరెస్టు సమయంలో నిబంధనలు పాటించామని కోర్టుకు తెలియజేశారు.
వాదనలు విన్న న్యాయస్థానం.. కేసు డైరీని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎన్‌ఓసీపైనా నిర్ణయం తీసుకుంటామని తెలుపుతూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కేసు డైరీని రేపు ఉదయం 10.30 కల్లా తమ ముందు ఉంచాలని సీఐడీని ఆదేశించింది.