మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు అక్రమంగా భూఆక్రమణ చేశారంటూ.. నేటి ఉదయం ఇరిగేషన్ అధికారులు జేసీబీతో ఆయన ఇంటి వెనుక గోడను కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై.. హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. మంత్రి తానేటి వనిత ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. దాన్ని గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనకు 15 రోజులకు ముందే నోటీసులు ఇచ్చారు.
అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే పోలీసులు వచ్చారని స్పష్టం చేశారు తానేటి వనిత. మహిళలను, దళితులను తన భర్త కించపరిచినట్టు మాట్లాడినప్పుడు ఆయన భార్య మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి రాజకీయ కుట్ర అని ఆరోపించడం దారుణమని, దీన్ని రాజకీయ కుట్ర అనడం సరికాదు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు కుల ప్రస్తావన తీసుకువస్తున్నాయని తానేటి వనిత మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె వెల్లడించారు.