రాజకీయాలు వేటిపైనైనా చేయొచ్చు.. కానీ, కీలక సమయాల్లో కొన్నింటిని రాజకీయం చేయడం ఏం బాగుంటుంది? ప‌్రపంచాన్ని చదివానని చెప్పే చంద్రబాబుకుఈ విషయం తెలియదని అనుకోలేం. కానీ, ఆయన చేస్తున్న రాజకీయాలు చూస్తే.. ఒకింత ఏవ గింపు కలుగుతోంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలను అందించాలన్నా.. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా సరిపడా నిధులు అవసరం. ప్రస్తుతం ప్రభుత్వాల వద్ద నిధులు లేవు. ఏదో అరకొరగా కేంద్రం ఇచ్చే నిధులను ఇప్పటికే వినియోగించాయి. వినియోగిస్తున్నాయి కూడా. ఈ క్రమంలోనే ఎన్నడూ చేయి చాచని జగన్ వంటివారు కూడా దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు.
దీంతో రాజకీయాలకు అతీతంగా అనేక మంది స్పందిస్తున్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ నిధులు ఇస్తున్నారు. కొందరు నేరుగా ఇస్తుంటే.. మరికొందరు ఆన్‌లైన్‌లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 500 కోట్లు సమకూరినట్టు భావిస్తున్నారు. అదేసమయంలో మరీ ముఖ్యంగా చంద్రబాబు కూడా తన సొంత సంస్థ హెరిటేజ్ నుంచి కూడా ఏపీకి నిధులు ఇచ్చారు. అదేసమయంలో తన ఎమ్మెల్యేల ఒకనెల వేతనాన్ని ఇచ్చారు. ఇద్దరు ఎంపీలతోనూ సాధ్యమై నంత వరకు సాయం చేయించారు.
ఇంత వరకు బాగానే ఉంది. అయితే, విరాళాలు ఏం చేస్తున్నారు? లెక్కలు చెప్పండి? శ‌్వేత పత్రం విడుదల చేయండి? అని అడగడం ఏమీ బాగోలేదు! నిజానికి ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ప్రతిపక్షంగా ఆయనకు ఉన్నా.. ఈ సమయంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నా రు. కొందరు లాక్‌డౌన్ ఎత్తేస్తే తమ పనులు తాము చేసుకుంటామని లబోదిబోమంటున్నారు. మరికొందరు కరోనా కాటు ఇంకెన్నాళ్లని బాధపడుతున్నారు. ఈ సమయంలో రాజకీయాలు చేయనంటూనే చంద్రబాబు ఇలా విరాళాలకు సంబంధించి లెక్కలు చెప్పాలని ప్రశ్నలు సంధించడం, తన పరివారాన్ని ఇలానే ప్రశ్నించండని కోరుతుండడం వంటివి ఎబ్బెట్టుగా ఉన్నాయి.
నిజానికి రాజధాని అమరావతి నిర్మాణానికి అనేక రూపాల్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ విరాళాలు సేకరించారు. మరి వాటికి ఏనాడైనా లెక్కలు చెప్పారు. అనేక మంది మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా విరాళంగా ఇచ్చారు. అది ఏం చేశారు? అని అప్పట్లో ఎవరైనా ప్రశ్నించారా? ఏదైనా సమయం.. సందర్భం చూసుకుని మాట్లాడితే.. బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. మరి బాబు మారతారా? చూడాలి.