జూన్ మాసం ముగింపు దశలోనూ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించాయి. ఈ మేరకు విజయవాడలో భారీ వర్షం కురవడంతో నగర వాసులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇవాళ సాయంత్రం విజయవాడ సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూన్ 11 నుంచే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బార్డర్ వద్ద మందగించిన రుతు పవనాలు ప్రస్తుతం చురుగ్గా కదలుతున్నాయి.
ఈ క్రమంలోనే మంగళవారం రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. రాగల 2, 3 రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారత్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించనుందని స్పష్టం చేసింది.
రేపు పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా.. విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇక, ఎల్లుండి శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా.. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి.. మరోవైపు.. శుక్రవారం అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.