టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య టికెట్ ధరల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించడం పట్ల సినీ ఇండస్ట్రీ అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పటికే పలు మార్లు దిల్ రాజు వంటి వారు ప్రభుత్వంతో చర్చించారు. ఇటీవల నాని ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్ల కన్నా.. కిరాణా కొట్టు కలెక్షన్ లే ఎక్కవ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ మంత్రులు అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. దీంతో పాటు ఏపీలో ప్రస్తుత ధరలతో థియేటర్లు నడపలేమని యజమానులు థియేటర్లను మూసివేస్తున్నారు. దీనికి తోడు నిబంధనల అతిక్రమణ పేరుతో ప్రభుత్వం పలు థియేటర్లకు నోటిసులు ఇవ్వడంతో పాటు సీజ్ చేసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దలు మరోసారి టికెట్ ధరల నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతున్నారు. దీంతో టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై జీవో కూడా జారీ చేసింది. దీనికి హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈయనతో పాటు రెవెన్యూ, ఆర్థిక, మున్సిపల్ ముఖ్య కార్యదర్శులు, సమాచార కమిషనర్, న్యాయ శాఖ సెక్రటరీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఎగ్జిబిటర్లు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా కమిటీలో భాగంగా ఉండనున్నారు. టికెట్ ధరలపై ఈ కమిటీ పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.