తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని నియమించింది.అంతేకాకుండా వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను అపాయింట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఆ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గౌడ్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు.కాగా, ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
ఇక రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు ఇంచార్జ్ వీసీలను సైతం మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఏర్పడిన కోఠి మహిళా కళాశాలకు ఇంఛార్జి వీసీగా దనావత్ సూర్య, బాసర ఐఐఐటీ ఇంచార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్‌లు నియామకం అయ్యారు. తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా నియామకమైన ధనవాత్ సూర్య ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా విధుల్లో కొనసాగుతున్నారు.