దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని తుపాకీతో కాదు.. చట్టబద్దంగా నడపాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్కౌంటర్లకు తాను వ్యతిరేకమని అసదుద్దీన్ స్పష్టం చేశారు. దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన నాడే అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. కాగా దిశా నిందితుల ఎన్కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జనవరి మాసంలో సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు తన నివేదికను అందించింది. దీని ఆధారంగా శుక్రవారంనాడు సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.గతంలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పౌరహక్కుల సంఘం నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సిర్పూర్కర్ కమిషన్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని సర్పూర్కర్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసిందని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది కృష్ణ చెప్పారు.