ఆదివారాన్ని విధ్వంస దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చిదంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను కూల్చడాన్ని ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడిపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు.
ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, అధికారంలో ఉన్న పక్షానికి పోలీసులు మద్దతుగా నిలిస్తే.. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే పోలీసులు, అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలు అని ఆయన విమర్శించారు. పోలీసుల అతిప్రవర్తన హద్దు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకొంటాయో, అరాచక శక్తులు ఏ విధంగా చెలరేగిపోతాయో, ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో మూడేళ్లలో జగన్ రెడ్డి పాలనలో జరిగిన ఉదంతాలే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.