ఊరందరికీ వైరస్ అంటించి.. తాను అంటించుకున్నారని విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శనాస్త్రాలు సంధించారు. కడపలో సీబీఐ దిగేసరికి కొవిడ్ టెస్ట్ నెగెటివ్ వచ్చినా.. పాజిటివ్ అంటూ అల్లుడి పాలనలో వైద్యం మీద నమ్మకంలేక తెలంగాణకి వెళ్లి అపోలో లో చేరారని దుయ్యబట్టారు. సీబీఐ విచారణకు విశ్రాంతి అనేసరికి మళ్లీ కోవిడియట్ అవతారమెత్తి వైరస్ వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్ల చిన్నమెదడేమన్నా చితికిపోయిందేమో.. అమరావతికి మద్దతుగా దమ్ముంటే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది విజయసాయి రెడ్డే కదా. తీరా చంద్రబాబు సై అంటే కరోనా అంటూ కపటనాటకాలెందుకు, అంత ప్రజాబలం ఉంటే 151 మంది రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు. కరోనా తగ్గాకే ఈసీ ఎన్నికలు జరుపుతుందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గత కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారిక ప్రకటన లేదు.