తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ భారీ వర్షాలకు విదేశీ కుట్ర అని, క్లౌడ్ బస్టర్ తో భారీ వర్షాలు కురిసేలా చేశారంటూ ఆరోపించారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ.. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. బహుశా సీఎంకు మతి భ్రమించినట్లుంది. ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనను చూసి జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలి. ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలి. కానీ ఈ సీఎం అక్కడికి వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయి. గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చినయ్… ఈసారి కూడా వచ్చినయ్.. భవిష్యత్తులో రావని కూడా చెప్పలేం… కానీ కేసీఆర్ కు మాత్రం భారీ వర్షాలు మానవ స్రుష్టిలా కన్పిస్తోంది. పైగా విదేశాల కుట్రనట. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్… తానే పెద్ద ఇంజనీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయింది. మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసింది. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారు. విదేశీ కుట్ర పేరుతో మరో డ్రామాకు తెరదీశారు. వారం రోజులుగా వరద ముంపుతో ప్రజలు అల్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీతాలందక ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
జీతాలివ్వడం చేతగాక వర్షాల అంశాన్ని విదేశీ కుట్ర పేరుతో అంతర్జాతీయం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. కేసీఆర్… పోరంబోకు మాటలాపి భారీ వర్షాలకు ఇండ్లు కోల్పోయి పూర్తిగా నిరాశ్రయులైన వేలాది మంది ముంపు బాధితులను ఏ విధంగా ఆదుకుంటావో చెప్పాలి. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తాననడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. సర్వం కోల్పోయిన బాధితులకు ఆ డబ్బు ఏ మూలకు సరిపోతుంది? పైగా గతంలో హైదరాబాద్ వరద ముంపు బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ సొంతం. చేసిన అరకొర సాయం టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిన విషయం ప్రజలింకా మరువలేదు. వాస్తవానికి సీఎం పర్యటనలో భాగంగా వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టం, బాధితుల సంఖ్యపై అంచనా వేసి.. ఆర్ధిక సాయం ప్రకటిస్తారని ఆశించాం. కానీ అవేమీ లేకుండా కేసీఆర్ పర్యటన గాలి పర్యటనలా మారింది. పైగా కరకట్టల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వడం, 10 వేల ఇండ్లతో కాలనీని నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు బండి సంజయ్