రేవంత్ ఇలాకాపై బండి ఫోకస్..!

-

తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉంది..ఇక బీజేపీ బలం మరింత పెరిగేలా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నారు…ఓ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే…మరో వైపు పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో ప్రజా సంగ్రామ యాత్రని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మూడు విడతల్లో జరిగిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది.

bandi sanjay kumar revanth reddy
bandi sanjay kumar revanth reddy

ఇక ఇదే ఊపుతో నాలుగో విడత పాదయాత్రకు కూడా బండి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు రూరల్ ప్రాంతాల్లోనే ఎక్కువ పాదయాత్ర చేసిన బండి…నాలుగో విడతలో అర్బన్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో పాదయాత్ర చేయాలని బండి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే మల్కాజ్‌గిరి ఎంపీగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోవడంతో…రేవంత్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే రాష్ట్రంలో వేగంగా పుంజుకుంటున్న బీజేపీ బలం మరింత పెంచే దిశగా పాదయాత్ర చేస్తున్న బండి..ఇప్పుడు రేవంత్ ఇలాకాపై ఫోకస్ పెట్టారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేసి..అక్కడ బీజేపీ బలం పెంచాలని చూస్తున్నారు.

కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్బీ నగర్‌, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి యాత్ర రూట్‌ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. అయితే ఇందులో ఒక్క ఇబ్రహీంపట్నం మినహా మిగతా ఏడు అసెంబ్లీ స్థానాలు మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోకే వస్తాయి. అంటే మల్కాజ్‌గిరిలో బీజేపీ బలం పెంచాలని బండి చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఒక్క మల్కాజ్‌గిరి అసెంబ్లీలోనే బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ మరిన్ని సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బండి పాదయాత్ర ఉండనుంది. మరి బండి యాత్రతో మల్కాజ్‌గిరిలో బీజేపీ బలం ఏ మేర పెరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news