నా చావుకు కారణం మంత్రి పువ్వాడ అజయ్ అని సాయి గణేష్ చెప్పాడు… అయినా పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదు… సీఎం ఆఫీస్ నుంచి కొంత మంది అధికారులు ఇచ్చే ఆదేశాలను ఖమ్మం పోలీసులు పాటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఖమ్మంలో ఆయన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. కమ్మ సంఘం ఎన్నికల్లో కమ్మ కులస్తులే పువ్వాడ అజయ్ ని పట్టించుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రికి కళ్లు, చెవులు ఉంటే మంత్రి పువ్వాడ అజయ్ పై చర్యలు తీసుకునేవారని ఆయన అన్నారు. కమ్మ కులస్తులు ఎవ్వరూ పువ్వాడ అజయ్ ను నమ్మడం లేదని అన్నారు. అజయ్ మరణానికి కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా అజయ్ ని వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణలో మర్డర్లు చేసేవాళ్లు, క్రిమినల్స్ రాజ్యం ఏలుతున్నారని విమర్శించారు. సాయి గణేష్ ది ఆత్మహత్య కాదు మంత్రి పువ్వాడ చేసిన హత్య అంటూ విమర్శలు గుప్పించారు బండి సంజయ్. రాష్ట్రంలో అక్కడక్కడ చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలకు టీఆర్ఎస్ నేతలే కారణం. అధికారుల నుంచి లక్షల రూపాయలు తీసుకుని పోస్టింగులు ఇస్తున్నారని… సీఎం ఆఫీస్ కు సీఎంఓ కార్యాలయాలకు వాటాలు పోతున్నాయంటూ ఆరోపణలు చేశారు.