పేదరికంలో తెలియని సౌందర్యం ఉంది. నవ్వు ఉంది. దుఃఖం ఉంది. బాధ ఉంది. వీటితో పాటు ఇంకొన్ని కూడా ఉన్నాయి. పేదరికం దాచుకోవడంతోనే దేశాలు తమని తాము తగ్గించుకుంటున్నాయి. వెల్లడి చేశాక అంతా మంచే జరగవచ్చు. లేదా మిత్ర దేశాలు సాయం చేయవచ్చు. కనుక మనం దాగుండిపోవడం అన్నది తప్పు. పేదరికంలో ఉన్న సౌందర్యం దృష్ట్యా ఇవాళ్టి బ్యూటీ స్పీక్స్ మాట్లాడుతోంది మీతో ! కొన్ని ఆసక్తిదాయక విషయాలే చర్చిస్తోంది మీతో ! వీటిలో రాజకీయం లేదు కానీ రాజకీయ నాయకులు ఇంకా చెప్పాలంటే పాలక వర్గాలు చేస్తున్న లేదా చేసిన తప్పిదాలే ఉన్నాయి. తప్పిదాలు కనుక దిద్దుకోవచ్చు. దోషాలు కనుక వాటిని కూడా పరిహరించుకోవచ్చు. దిద్దుకోలేని తప్పిదాలు అయితే ఇవి కాదు కానీ పాలకులు వీటిపై ఎందుకనో దృష్టి సారించడం లేదు.
పేదరికంలో ఆనందం ఉంది. పేదరికంలో తీవ్ర భావోద్వేగాలు మిళితమై ఉన్నాయి. కనుక పేదరికం అన్నది శక్తిమంతం అయిన ఆయుధం అయింది కూడా ! మన దేశంలో చాలా మంది ఎదిగి వచ్చిన వారికి పేదరికం ఓ గొప్ప నేపథ్యం అయి ఉంది. కనుక లేమి తనాన్ని తిట్టుకోవడం కానీ లేమితనం గురించి చెప్పుకోవడం కానీ తప్పు కాదు.
నిన్నటి వేళ ఓ సూపర్ పోలీస్ ను అమిత్ షా (కేంద్ర హోం మంత్రి) సన్మానించారు. ఆయన పేరు దోంపాక శ్రీనివాస రావు. నేషనల్ ఇన్విస్టిగేటివ్ అథారిటీలో డీఎస్పీ హోదాలో ఉన్నారు. త్వరలో పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన చేసిన సేవలకు ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్రం. ఆ విధంగా ఆయన విశిష్ట వ్యక్తిగా వార్తల్లో నిలిచి దేశ రాజధానిని సైతం అబ్బురపరిచారు. ఆయనిది మా శ్రీకాకుళం జిల్లా,నరసన్నపేట మండలం, నడగాం గ్రామం. ఆయన నేపథ్యం కూడా పేదరికమే ! కానీ ఆయన దాచుకోలేదు. కృషికి పట్టుదల తోడయిన రోజు ఇలాంటి వారు ఎందరో విశిష్ట వ్యక్తులుగా ఈ దేశం కీర్తిని పెంచే స్థాయికి చేరుకోవడం ఖాయం. మరి! ఇదే అమిత్ షా నేతృత్వంలో నడుస్తున్న బీజేపీ ఎందుకని పేదరికాన్ని అవమానంగా భావించి, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన నేపథ్యలో గుజరాత్ లో ప్రధాన దారులు (ఆయన పర్యటించే ప్రధాన దారులు అని రాయాలి) ను అతి శుభ్రం చేయిస్తూనే, దారులకు ఇరువైపులా తెల్లని వస్త్రంతో కూడిన పరదాలను ఎందుకని కడుతున్నారు.
ఓ వైపు మన స్థితిగతులను వివరిస్తూ..వివిధ దేశాల సాయం అడుగుతూనే, మరోవైపు మనం మనల్ని ఎందుకు ఇలా దాచుకుని, వాస్తవాలు వెల్లడి కాకుండా చేయడం..ఇదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారనుంది. అదేవిధంగా ఆ రోజు ట్రంప్ మరియు ఇవాంక పర్యటన నేపథ్యంలోనూ భాగ్యనగరిలో ఇదే విధంగా హడావుడి చేసి రాత్రికి రాత్రి ప్రధాన రహదారులకు తాత్కాలిక మోక్షం ఇచ్చేశారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పనిచేసే అధికారులు. ఇంకా కొంత కాలం వెనక్కు వెళ్తే చంద్రబాబు కూడా క్లింటన్ పర్యటన నేపథ్యంలో ఈ తరహా తప్పిదాలే చేశారు అని అప్పట్లో ప్రధాన మీడియాలో కథనాలు వచ్చాయి. కనుక మనం మన పేదరికాన్ని, పేదరికంలో ఉండే ఆటుపోట్లను, ఆత్మగత సౌందర్యాన్నీ దాచుకోకుండా లోకానికి వెల్లడి చేస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే పేదరిక నేపథ్యం నుంచి వచ్చి, అవమానాలు ఎదుర్కొని, అవరోధాలు దాటుకుని వచ్చే వ్యక్తులకు ఇచ్చే గౌరవం స్థాయి మరింత రెట్టింపు అవుతుంది. లేదంటే ఇవన్నీ కేవలం ఫొటొసెషన్ ఓరియెంటెడ్ ప్రొగ్రామ్స్ గానే మిగిలిపోతాయి.
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి..