ఎప్పుడైతే బీజేపీకి దూరమయ్యారో అప్పటినుంచి చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయనే చెప్పొచ్చు. 2014లో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన బాబు..ఆ తర్వాత బీజేపీకి యాంటీగా రాజకీయం చేశారు…రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అలా చేయడం వల్ల 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. బాబు చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. బీజేపీని వదులుకున్నందుకు ఏం జరిగిందో బాబుకు అర్ధమైంది.
అందుకే మళ్ళీ బీజేపీకి మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు…రాజ్యసభ సభ్యులుగా ఉన్న తన అనుచరులని బీజేపీలోకి పంపించారు. ఇక అన్నిరకాలుగా బీజేపీకి మద్ధతు ఇస్తూ వస్తున్నారు. ఆ మధ్య ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి పరోక్షంగా సహకరించారు. ఇక అడగకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధికి మద్ధతు ఇచ్చారు. ఇప్పుడు మోదీ ఆధ్వర్యంలో జరిగే ఆజాదీ అమృత్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరవుతున్నారు.
ఇలా అన్నిరకాలుగా బీజేపీకి దగ్గరవ్వడానికే బాబు ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు బీజేపీ మాత్రం బాబుని దగ్గరకు రానివ్వలేదు. కానీ ఇటీవల ఎందుకో బీజేపీ నేతల వైఖరి కూడా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు అంటే విరుచుకుపడే నేతలు..ఇప్పుడు వర్షన్ మార్చారు. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏ స్థాయిలో బాబుపై ఫైర్ అవుతూ ఉంటారో అందరికీ తెలిసిందే…ఈయన జగన్ కు అనుకూలంగా ఉంటారనే విమర్శలు కూడా ఉన్నాయి.
అలాంటిది సోము వర్షన్ ఒక్కసారిగా మారింది..రాజధాని అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న సోము…ఈ మధ్య జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా సోము…చంద్రబాబుని పోగొడుతూ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు దార్శనికుడు కాబట్టే..ఆ నాడు కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.8,500 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిందని, జగన్ దార్శనికుడు కాదు కాబట్టే ఇప్పుడు నిధులు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు.
ఇలా సోము సడన్ గా వర్షన్ మార్చి…బాబుని పొగడటం, జగన్ ని విమర్శించడం చేశారు. దీంతో బాబుని బీజేపీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తుందని ప్రచారం మొదలైంది..ఏపీలో బీజేపీ సింగిల్ గా సత్తా చాటడం కష్టం. జనసేనతో పొత్తు ఉన్నా సరే ఆ పార్టీకి ఒక సీటు కూడా గెలుచుకునే కెపాసిటీ లేదు. కొద్దో గొప్పో టీడీపీతో కలిస్తేనే నాలుగు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. పైగా పవన్ సైతం…జగన్ కు చెక్ పెట్టడానికి బాబుతో కలవడానికి రెడీగా ఉన్నారు..ఒకవేళ దీనికి బీజేపీకి ఒప్పుకోకపోతే, ఆ పార్టీని పక్కన పెట్టేలా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వర్షన్ మార్చుకుని బాబుతో క్లోజ్ అవుతున్నట్లు కనిపిస్తోంది.