జనసేన యాక్షన్‌ కమిటీ పై ఆరా తీసున్న కమలనాథులు

-

మిత్రపక్షాలంటే క్లారిటీతో ఉంటాయని.. ఒకే మాటపై నిలబడతాయని అనుకుంటాం. బీజేపీ,జనసేనలు మాత్రం దీనికి భిన్నంగా వెళ్తున్నాయి.లోక్‌సభ ఉపఎన్నికపై రెండు పార్టీలు రోజుకో మాట చెబుతున్నాయి. ఇదే సమయంలో జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని ప్రకటించేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. ఆలస్యం చేస్తే మిత్రపక్షం జనసేన ఎక్కడ సీటు తన్నుకుపోతుందో అన్న ఆత్రుత.. గాబరా ఆయన ప్రకటనలో కనిపించాయని పవన్‌ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. రెండు పార్టీల మధ్య వీర్రాజు ప్రకటనపై చర్చ జరుగుతున్న సమయంలో జనసేన నుంచి మరో అస్త్రం బయటకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.

45 మండలాల్లోని పోలింగ్‌ బూత్‌లు.. 15 మంది రాష్ట్రస్థాయి నేతలు ఇంఛార్జ్‌లు. తిరుపతి లోక్‌సభకు జరగబోయే ఉపఎన్నికలో బీజేపీ వ్యూహం ఇదే. 2024కు ఏపీలో బలపడాలంటే తిరుపతిని బేస్‌గా చేసుకోవాలని తహతహలాడుతున్నారు కమలనాథులు. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు లభిస్తే తిరుగే ఉండదని.. సెంటిమెంట్‌ కూడా బాగా వర్కవుట్‌ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.

ఇదే సమయంలో పది మందితో యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేశారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. ఈ పది మంది జనసేన సిద్ధాంతాలను.. ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్తారన్నది JSP ప్రకటనలోని సారాంశం. తిరుపతి లోక్‌సభ పరిధిలోని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే యాక్షన్‌ కమిటీ లక్ష్యంగా చెప్పడంతో బీజేపీ, జనసేన కేడర్ల మధ్య మళ్లీ గందరగోళం మొదలైంది. తిరుపతి సీటును వదులుకోవడానికి జనసేన సిద్ధంగా లేదన్న అనుమానాలు మళ్లీ బలపడుతున్నాయి. ఇలా పూర్తిస్థాయిలో ఒక యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసి.. తిరుపతి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని చెప్పడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఇంతకముందు ఏకపక్షంగా తిరుపతిలో దూకుడు ప్రదర్శిస్తోన్న బీజేపీ స్పీడ్‌కు జనసేన బ్రేక్‌ వేసింది. పవన్‌ ఢిల్లీ పర్యటనతో ఉమ్మడి అభ్యర్థి అనే కొత్త పదాన్ని తెరపైకి తెచ్చింది. ఇంతలో తిరుపతిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన బీజేపీ.. ఏమనుకుందో ఏమో జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని చెప్పింది. దాంతో పవన్‌ను మళ్లీ జో కొట్టారని ప్రచారం జరిగింది. ఈ ప్రకటనకు ముందు పవన్‌, వీర్రాజు తదితర పార్టీ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించి తిరుపతిపై కూడా చర్చించారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఫలితంగానే వీర్రాజు అలా మాట్లాడి ఉంటారని అంతా భావించారు. ఇంతలో జనసేన విడుదల చేసిన తాజా ప్రకటన వెనక అర్థం ఏంటా అని ఆరా తీస్తున్నారట.

ఒకవేళ జనసేన పోటీ చేయకపోతే.. బీజేపీతో కలిసి ఎన్నికల వ్యూహంలో పాల్గొనాలి. రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో కదలాలి. మిత్రపక్షాలు అన్న మాటేగానీ.. తిరుపతి విషయంలో రెండు పార్టీలు తలోదారిలో వెళ్తున్నాయి. కలిసి సాగిన దాఖలాలు ఇంత వరకు లేవు. పైగా ఉమ్మడి అభ్యర్థి అంటూనే గందరగోళ ప్రకటనలు చేస్తున్నారు నాయకులు. అలాగే తిరుపతి ఎవరు పోటీ చేయాలన్నదాని పై మిత్రపక్షాల మధ్యే పోటీ ఉందనే అభిప్రాయం కలుగుతోంది. ఇప్పటికే ఈ కన్ఫ్యూజన్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. రెండు పార్టీల అభిమానులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. మరి.. ఈ సమస్య శ్రుతి మించి రాగాన పడకుండా రెండు పార్టీలు కలిసి ప్రకటన చేస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news