మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతున్నాయో అర్థంకావడంలేదని అన్నారు సత్యకుమార్. రాష్ట్రంలో కనీసం పంట కాల్వలు కూడా తవ్వడంలేదని, ఈ ప్రభుత్వం డ్యాములు నిర్మిస్తుందంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు సత్యకుమార్. సుంకేసులు, భైరవానితిప్ప, హంద్రీనీవా… ఇలా అనేక ప్రాజెక్టులను పట్టించుకోవడంలేదని, ఉత్తరాంధ్రలో వంశధార, మహేంద్ర తనయ, ఝంఝావతి కానీ ఒక్క ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యత ఇవ్వడంలేదని తెలిపారు సత్యకుమార్. ఒక్క ప్రాజెక్టుకు కూడా పైసా నిధులు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఈ విధంగా అయితే ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు? రైతులకు ఎలా సాగునీరు అందుతుందని సత్యకుమార్ నిలదీశారు.
“మీరు ఇవన్నీ చేస్తే వికేంద్రీకరణ కూడా అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేసి చూపించింది కదా. మేం చేయమంటోంది అదే కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి మాటలతో నెట్టుకొస్తోంది. పరిశ్రమలు తీసుకురాకుండా, ఉద్యోగవకాశాలు కల్పించకుండా మోసం చేస్తోంది. ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ జోన్లను ఇస్తే, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భూములే ఇవ్వలేదు. ఒక్కో జోన్ ద్వారా 5 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెల్లూరులో బాల్కో, మిథానీ కలిసి రూ.4,500 కోట్లతో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే ఇప్పటిదాకా భూములే ఇవ్వలేదు. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములు ఇవ్వట్లేదు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఐదు పైసలు కూడా విదల్చడంలేదు. రూ.18 వేల కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు కేంద్రం మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే అవి ఆగిపోయాయి అని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.