హనుమంతుడి జన్మస్థలం ఎక్కడనే విషయంపై ఇటీవల దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా ఈ విషయంపై చర్చోపచర్చలు, భిన్నవాదనలు ప్రచారం అవుతున్నాయి. ఆంజనేయ స్వామి జన్మస్థలం కర్ణాటకలోని కిష్కింధ అని మహంత్ గోవింద్ దాస్ స్వామి వాదిస్తుంటే.. మరో వైపు ఏపీలోని తిరుమల కొండల్లో ఒకటైన అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని తిరుమల ఆస్థాన పండితులు చెబుతున్నారు. అలాగే మహారాష్ట్రకు చెందిన కొందరు పండితులు ఆంజనేరి పర్వతాల్లో హనుమంతుడు జన్మించాడని ఆరోపిస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై గోవాకు చెందిన బీజేపీ నేత కుమారుడు, అడ్వకేట్ శ్రీనివాస్ ఖలాప్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడి జన్మస్థలం అక్కడ, ఎక్కడా కాదు..? గోవాలోని అంజేదీవ ద్వీపమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వాల్మీకి రామాయణంలో స్పష్టం వివరించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఖలాప్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. హనుమంతుడి తల్లి అంజనీదేవి సముద్రంలోని ఓ ద్వీపంలో తపస్సు చేసిందని పేర్కొన్నారు. అప్పుడు వాయుదేవుడి వరంతో హనుమంతుడు జన్మించాడన్నారు. అప్పటి నుంచి ఆ ద్వీపం పేరు అంజనీ ద్వీప్‌గా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ విషయాన్ని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా వివరించాడని తెలిపారు.