టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి…బీజేపీలో చేరి, మళ్ళీ హుజూరాబాద్ బరిలో గెలిచాక ఈటల రాజేందర్..ఏ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దించాలనే లక్ష్యంగా ఈటల పనిచేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలని బీజేపీలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ వేదిక అయినా ఈటల టార్గెట్ మాత్రం కేసీఆర్ అన్నట్లు ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో పోటీ చేసి కేసీఆర్‌ని ఓడిస్తానని ఈటల సవాల్ చేశారు. కేసీఆర్ పతనమే తన లక్ష్యమని, కేసీఆర్‌ని అసెంబ్లీకి రానివ్వకుండా చేస్తానని అంటున్నారు.
అయితే ఇలా కేసీఆర్‌ని టార్గెట్ చేయడంతో టీఆర్ఎస్ సైతం ఈటలని టార్గెట్ చేసింది. కాకపోతే రాజకీయంగా ఈటలకు చెక్ పెట్టలేకపోతున్నారు. దీంతో అధికార బలంతో ఈటలని నిలువరించాలని టీఆర్ఎస్ గట్టిగా ట్రై చేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా అసెంబ్లీ సమావేశాలని కేవలం పది నిమిషాలు జరిపి వాయిదా వేయడంపై ఈటల…స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
కేసీఆర్ చెప్పినట్లు స్పీకర్ చేస్తున్నారని, కేసీఆర్ చేతిలో మరమనిషిలా ఉన్నారని ఈటల విమర్శించారు. స్పీకర్‌ని మరమనిషి అనడంపై మంత్రులు ఈటలపై ఫైర్ అయ్యారు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఈటల దీనిపై స్పందించలేదు. ఇదే క్రమంలో తాజాగా ఈటల అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఈటల వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాల్సిందే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. అటు మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం…ఈటల వెంటనే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈటల మాట్లాడుతూ… ‘‘12ఏళ్లుగా సభలో ఉన్నాను… సభా మర్యాదలు నాకు తెలుసు. సభ నుంచి తనను బయటకు పంపాలని చూస్తున్నారా…మీ ఉద్దేశం ఏంటి’’ అంటూ ప్రశ్నించారు.
ఈ క్రమంలో క్షమాపణ చెప్పకపోవడంతో ఈటలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేసి ఆయన ఇంటి వద్ద వదిలేశారు. ఈ విషయంపై ఈటల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇదంతా టీఆర్ఎస్ నాశనానికే అని మండిపడ్డారు. గొంతు నొక్కుతున్నారని, కేసీఆర్‌ని గద్దె దించే వరకు విశ్రమించనని అన్నారు. మొత్తానికి ఈటలని టీఆర్ఎస్ గట్టిగానే టార్గెట్ చేసింది.