బద్వేల్ స్పెషల్: బీజేపీకేనా… జనసేనకు సత్తా లేదా?

-

బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఉంది. ఇరువురూ పలు వేదికలు పంచుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వంపై పోరాటాలు గట్రా చేస్తున్నారు. సంయుక్త కార్యాచరణకు పిలుపునిస్తున్నారు. కొన్ని కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. పవన్ ని ఏమైనా అంటే బీజేపీ నేతలు – బీజేపీని ఏమైనా అంటే పవన్ మైకులముందుకు వస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ చిత్రంగా.. ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం సయోధ్య కుదరడం లేదు!

అవును… ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ – జనసేనలు ఎవరికి వారే పైచేయిసాధించాలని భావిస్తున్నారు. మొన్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయంలో కూడా టికెట్ కోసం పవన్ ఎంతో ప్రయత్నించారు. కానీ.. సాధ్యం కాలేదు. ఫలితంగా జనసేన కేవలం ప్రచారానికి పరిమితం అయిన పరిస్థితి! ఇక స్థానికం.. పరిషత్ మునిసిపాలిటీ ఎన్నికల్లో పొత్తు ఉందని చెప్పుకొన్నా.. ఎవరికి వారుగానే పోటీ చేశారు.

ఇవన్నీ ఒకెత్తు అయితే తాజాగా తెరపైకి వచ్చిన బద్వేల్ ఉప ఎన్నిక మాత్రం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తు విషయంపై క్లారిటీ ఇచ్చేసే అవకాశాలున్నాయి! కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. ఇది ఎస్సీ నియోజకవర్గం. పైగా సీఎం జగన్ కు సొంత జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నిక. ఇక్కడ టీడీపీ – వైసీపీలు తన అభ్యర్థులను ప్రకటించేశాయి. అయితే… ఈ సీటు విషయంలో బీజేపీ కానీ, జనసేన కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు!

అయితే ఈ విషయంలో బద్వేల్ సీటు కూడా బీజేపీ నే తీసుకుని.. జనసేనను కేవలం ప్రచారానికి పరిమితం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుసుంది. దానికి తాజాగా “జగన్ ను సొంత జిల్లాలో ఓడించగల సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది” అంటూ సోము వీర్రాజు మాట్లాడిన మాటలే ఉదాహరణ! అయితే.. పవన్ మాత్రం ఈ విషయంలో తగ్గేది లేదని అంటున్నారట. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు స్థానం వదులుకున్న నేపథ్యంలో.. బద్వేల్ మాత్రం తమకే కేటాయించాలని ఆయన గట్టిగా కోరే అవకాశం ఉందని అంటున్నారు.

ఒకవేళ సర్దుబాటు కాని పక్షంలో.. తనే స్వయంగా పోటీకి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా… బద్వేల్ ఉప ఎన్నిక పుణ్యామాని బీజేపీ – జనసేన ల పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయనే చెప్పుకోవాలి!

Read more RELATED
Recommended to you

Latest news