సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.200కోట్ల ‘నల్ల ధనం’!

-

ఇటీవల తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నల్లధనం గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు శనివారం వెల్లడించింది. ఈ సోదాల్లో రూ.200 కోట్లకు పైనే లెక్కల్లో వెల్లడించని ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది.

ప్రముఖ సినీ నిర్మాతలు కలైపులి ఎస్‌.థాను, అన్బుసెళియన్‌, ఎస్‌ఆర్‌ ప్రభు, జ్ఞానవేల్‌ రాజా తదితరుల కార్యాలయాల్లో గత మంగళవారం (ఆగస్టు 2) నుంచి మూడు రోజుల పాటు ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. చెన్నై, మధురై, కొయంబత్తూర్‌లోని మొత్తం 40 చోట్ల ఈ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.26కోట్ల నగదు రూ.3కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీంతో పాటు రూ.200కోట్లకు పైగా అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది. లెక్కల్లో వెల్లడించని ఈ ఆదాయానికి సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నిర్మాతల ఇళ్లల్లో చేసిన తనిఖీల్లో సినిమాల విడుదల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువగా చూపించినట్లు అధికారులు గుర్తించారు. అంతేగాక, సినిమా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఆ మొత్తాన్ని లెక్కల్లో చూపించలేదని వెల్లడించారు.

ముఖ్యంగా నిర్మాత అన్బుసెళియన్‌కు చెందిన చాలా ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. అతని బంధువులు, సన్నిహితుల నివాసాలు, మదురై, చెన్నైలోని అతని కార్యాలయాలు, సినిమా థియేటరు తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిపారు. అన్బుసెళియన్‌ నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్‌, సినిమా హాల్స్‌ తదితర పలు వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన లెజెండ్‌ సినిమాను అన్బుసెళియన్‌ పంపిణీ చేసినట్లు సమాచారం. గతంలో రెండేళ్ల క్రితం ఆయన ఇళ్లు తదితర చోట్ల ఐటీ సోదాలు నిర్వహించారు. అప్పుడు రూ.70 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక, కలైపులి ఎస్‌.థాను నిర్మించిన కబాలి, అసురన్‌, కర్ణన్‌ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ప్రముఖ నటుడు సూర్య బంధువు అయిన ఎస్‌ఆర్‌ ప్రభు గతంలో కార్తి నటించిన ఖైదీ, సూర్య నటించిన ఎన్‌జీకే సినిమాలను నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news