నిన్నటి ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అమరావతి నిర్మాణాల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం జగన్ అసెంబ్లీలో షాపూర్ పల్లోంజీ కంపెనీ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. షాపూర్ పల్లోంజీ అంటూ సీఎం జగన్ మరో కట్టుకథ అల్లారని విమర్శించారు. గత నాలుగేళ్ల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని అన్నారు. రూ.6 లక్షల కోట్ల దోపిడీ జరిగితే నాలుగేళ్ల నుంచి ఏం చేస్తున్నారని బోండా ఉమ ప్రశ్నించారు. జగన్, మంత్రులు మాట్లాడేది అంతా బోగస్ అని స్పష్టం చేశారు.
మా వద్ద ఉన్న డాక్యుమెంట్లతో వస్తాం… చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మరో సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పందిస్తూ… అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని అన్నారు. ఎన్నికల్లో తీర్పుతో జగన్ మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే రాజధాని నిర్మాణాల పేరుతో కొత్త కథను తెరపైకి తీసుకువచ్చారని ధూళిపాళ్ల విమర్శించారు. అవినీతి ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు అప్పగించకుండా సభలో ప్రజంటేషన్లు ఏంటి? అని ప్రశ్నించారు.