రాష్ట్రంలో నియంత పాలనను పారద్రోలాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…ఉపఎన్నికలలో భారతదేశ చరిత్రలో మునుగోడు ప్రజలు కనివిని ఎరుగని యుద్ధం చేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నేను రాజీనామా చేశాను అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనను గద్దె తించడానికి బీజేపీ పార్టీలో చేరానని కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని తెలిశాక దాంట్లో ఉండలేకపోయనని అందుకే మన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పుకొచ్చారు.
నిన్న ఒక సభలో మాట్లాడుతూ గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా.. ఏనాడు పట్టించుకోలేదన్నారు రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న రోడ్ల సమస్యలపై మాట్లాడినా ఒక్క పని కూడా చేయలేదని చెప్పారు. తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాననే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, తన రాజీనామా దెబ్బకు గట్టుప్పల్ ను మండలంగా ఏర్పాటు చేశారని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.